Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 75

Parasurama- 2 !!

||om tat sat ||

రామ దాశరథే రామ వీర్యం తే శ్రూయతేsద్భుతమ్|
ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్ ||

"ఓ రామ ! దాశరథీ ! నీ పరాక్రమము అద్భుతము అని వింటిని. ధనస్సును భేధించుట గూడా ఆప్రతిధ్వనితో వింటిని".

బాలకాండ
డెబ్బది ఇదవ సర్గము

అప్పుడు పరశురాముడు శ్రీరామునితో ఇట్లనెను.

"ఓ రామ ! దాశరథీ నీ పరాక్రమము అద్భుతము అని వింటిని. ధనస్సును భేధించుట గూడా ఆప్రతిధ్వనితో వింటిని. ఆ ధనస్సు నీ చేత భేధించపడిన విషయము అద్భుతము ఊహింపరానిది . అది విని ఇంకొక అతి శుభమైన ధనస్సుని తీసుకు వచ్చితిని. ఇది ఆ జామదగ్నియొక్క భయంకరమైన మహత్తరమైన ధనస్సు. నీవు దీనిని శరములతో సంధించుము. నీ బలమును ప్రదర్శించుము. ఓ రాఘవ ! ఈ ధనస్సును సంధించినచో నేను వీరులచే ప్రశంసించబడిన నీకు ద్వంద్వయుద్ధము ప్రసాదించెదను"అని.

ఆట్టి ఆయన మాటలను విని విషణ్ణవదనముతో అంజలిఘటించి దశరధ మహారాజు ఇట్లు పలికెను. "ఓ మహామునీ ! మహాయశస్సు గలవాడవు. బ్రాహ్మణుడవు. క్షత్రియులను వధించు కోపము చల్లారినది. నా కుమారులు బాలురు. వారికి అభయమివ్వగలవాడవు. నియమ నిష్ఠలతో అధ్యయనము చేయగల భార్గవుల కులములో జన్మించినవాడవు. సహస్రాక్షుని తో ప్రతిజ్ఞచేసి శస్త్రములు వదిలినవాడవు. అట్టి నీవు ధర్మపరుడవై కాశ్యపునికి రాజ్యమును ఇచ్చి వనవాసమునకై మహేంద్రగిరి వచ్చితివి. ఓ మహామునీ నీవు నా సర్వమును నాశనము చేయుటకు వచ్చినవాడవా అనిపించుచున్నది. మా రాముడు లేనిచో మెమెవ్వరమూ జీవించియుండము".

ఈ విథముగా దశరథుడు చెప్పుచుండగా, ఆ మాటలు వినకుండా మిక్కిలి ప్రతాపము గల ఆ జమదగ్ని కుమారుడు అగు పరశురాముడు శ్రీరామునితో ఇట్లు పలికెను.

"ఈ దివ్య ధనుస్సులు రెండూ లోకములో శ్రేష్ఠ మైనవి ధృఢమైనవీ ప్రముఖమైనవీ బలముగలవీ. ఇవి విశ్వకర్మ చే చేయబడినవి అని అందరికీ తెలిసినవిషయమే. ఓ నరశ్రేష్ఠ ! ఓ కాకుత్‍స్థ ! నీచే భగ్నము చేయబడిన ధనస్సు త్రిపురాంతకుని సంహారముకై పరమేశ్వరునికి ఇవ్వబడినది. ఇది రెండవది. ఓ రామా ఇది విష్ణువు యొక్క ధనస్సు మిక్కిలి తేజోమయమైనది. తిరుగులేనిది. ఇది విష్ణువునకు దేవతలచే ఇవ్వబడినది. ఓ కాకుత్‍స్థ ఇది శివుని ధనస్సు తో సమానమైనది . అప్పుడు దేవతలందరూ శివ విష్ణువుల బలాబలములను ఎఱుగ దలిచి బ్రహ్మను ప్రశ్నించిరి. దేవతల ఉద్దేశమును ఎఱిగి పితామహుడు శివ విష్ణువుల మధ్య విరోధము కలిగించెను. పరస్పరము విజయము కోరుచున్న శివ విష్ణువులమధ్య మహత్తరమైన యుద్ధము జరిగెను. అప్పుడు విష్ణువుయొక్క హుంకారముతో మహాపరాక్రమము గల శివ ధనస్సు తేజోవిహీనమయ్యెను. మహదేవుడైన ఆ ముక్కంటి స్తంభితుడయ్యెను. అప్పుడు ఋషిసంఘములు చారణులతో కూడిన దేవతలు వచ్చి వారిని ప్రశాంతపరిచిరి. విష్ణుపరాక్రమము తో తేజో విహీనమైన శివ ధనస్సు చూచి ఋషిగణములు విష్ణువుయొక్క ఆధిక్యతను గ్రహించిరి. మహదేవుడు క్రుద్ధుడై విదేహమహరాజు మహాయశోవంతుడు రాజర్షి అగు దేవరాతుని వద్ద ఆ ధనస్సును న్యాసముగా ఉంచెను. ఓ రామా ! ఈ పరపురములను నాశనము చేయునట్టి ఈ ఉత్తమమైన వైష్ణవ ధనస్సు భార్గవుడగు ఋచీకుని వద్ద న్యాసముగా ఉంచెను. మహాతేజోవంతుడైన ఋచీకుడు నా తండ్రి ప్రతీకారముచేయని వాడు మహాత్ముడు అగు జమదగ్నికి ఇచ్చెను. కార్తవిర్యార్జునుడు ప్రాకృతమైన తన బుద్ధితో తపోబలసమన్వితుడైన నాతండ్రి అస్త్ర సన్న్యాసము చేసియుండగా ఆయనను వధించెను. తండ్రియొక్క దారుణమైన వధను విని కోపముతో పుట్టినవారిని పుట్టి నట్లే అనేకసార్లు తుదముట్టించితిని. సమస్త భూమండలము పొంది యజ్ఞము చివరిలో పుణ్యకర్మణుడగు కాశ్యపునికి దక్షిణ గా ఇచ్చి దేవతలు సంచరించునట్టి మహేంద్ర పర్వతము నిలయముగా తపస్సుచేయుచూ తపోబలసమన్వితుడనై సుఖముగా ఉంటిని".

పరశురాముడు మరల చెప్పసాగెను.

"ఓ మహాబల ! ఓ రామా ! నిరుపమాన శౌర్యముతో నీచేత ధనస్సు భేదించబడిన మాట విని నేను వెంటనే ఇచటికి వచ్చితిని. మా తాతముత్తతలనుంచి వచ్చిన మహత్తరమైన ఉత్తమమైన ఈ వైష్ణవ ధనస్సు క్షత్రియధర్మముగా గ్రహించుము. ఈ శ్రేష్ఠమైన శత్రుపురములను జయించునట్టి ధనస్సులో బాణమును సంధింపుము. ఓ కకుత్‍స్థ అట్లు చేయగలిగినచో నాతో ద్వంద్వయుద్ధము చేయుటకు నీకు అనుమతిఇచ్చెదను" అని.

ఈ విధముగా వాల్మీకిరామాయణములో బాలకాండలో దెబ్బది అయిదవ సర్గ సమాప్తము ||

||ఓమ్ తత్ సత్||

యోజయస్వ ధనుః శ్రేష్ఠే శరం పరపురంజయమ్|
యది శక్నోషి కాకుత్‍స్థ ద్వంద్వం దాస్యామి తే తతః ||

"ఈ శ్రేష్ఠమైన శత్రుపురములను జయించునట్టి ధనస్సులో బాణమును సంధింపుము. ఓ కకుత్‍స్థ అట్లు చేయగలిగినచో నాతో ద్వంద్వయుద్ధము చేయుటకు నీకు అనుమతిఇచ్చెదను".

||ఓమ్ తత్ సత్ ||